AMARAVATHI: ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ నెల 2న ప్రధాని మోదీ అమరావతి పనులను ప్రారంభించారు. దాదాపు 49 వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో శాశ్వత కట్టడాలతోపాటు పలు మౌలిక సదుపాయాలు నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే పదేళ్ల క్రితం రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతంలో ఇన్నాళ్లు ఏం జరిగింది? అసలు రాజధాని రూపురేఖలు ఎలా ఉన్నాయనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వం రాజధానిని అడ్డుకుందని కూటమి సర్కారు ప్రచారం చేస్తున్నా, అంతకుముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగిందనేది చర్చకు తావిస్తోంది. దీంతో రాజధాని ప్రాంతంలో ఏమేం ఉన్నాయనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.
ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా వీటిని నిర్మించారు. వీటికి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కూడా కల్పించారు. అయితే రాజధాని అమరావతి కోసం సుమారు 34 వేల ఎకరాల ప్రైవేటు భూములు సేకరిస్తే, ఈ మూడు భవన సదుపాయాలే నిర్మించారా? ఇంకా ఏం లేవా? అంటే పలు ప్రైవేటు సంస్థలు కొనసాగుతున్నట్లు అమరావతి రైతులు చెబుతున్నారు. తాము వదులుకున్న భూముల్లో కొలువైన విద్యాసంస్థల్లో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కూటమి సర్కారు భావిస్తోంది. 2015లో అమరావతి ఏర్పాటుకు నిర్ణయించిన వెంటనే ప్రభుత్వ భవనాల నిర్మాణంతోపాటు కొన్ని ప్రైవేటు వర్సిటీలకు సైతం భూములు కేటాయించింది. ఇందులో దేశవ్యాప్తంగా పేరున్న విద్యాసంస్థలు ఉన్నాయి. రెండు ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు మరో నాలుగు ప్రైవేటు వర్సీల్లో వేల మంది చదువుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకపోకలతో రాజధాని ప్రాంతం కళకళలాడుతోంది. వాస్తవానికి గత ఐదేళ్లలో పనులు నిలిచిపోకపోయి ఉంటే, ఈ పాటికి మరిన్ని విద్యాసంస్థలతోపాటు ఇతర ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో ఎయిమ్స్ విద్యాసంస్థ నడుస్తోంది. వైద్య విద్యలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ 2017లో ప్రారంభమైంది. తొలి బ్యాచులో 50 మందితోనే ప్రారంభమైన ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో ఏడాదికి 125 మంది చొప్పున చదువుకుంటున్నారు. అంటే మొత్తం ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న వారి సంఖ్య 625. ఇక పీజీ కోర్సులు, పారా మెడికల్ కాలేజీతో ఎయిమ్స్ లో కనిష్టంగా వెయ్యి మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా 950 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశారు. మొత్తం 183 ఎకరాల్లో ఎయిమ్స్ ఆస్పత్రి కొనసాగుతోంది. దీనికి సమీపంలోనే ఎన్ఆర్ఐ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది.
మరోవైపు రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - ఎన్ఐడీని ఏర్పాటు చేశారు. 2015లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలో దాదాపు 300 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలో వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఏపీ ప్రధానమైనదిగా చెబుతున్నారు. ఇందులో దాదాపు 14 వేల మంది విద్యార్థలు చదువుతున్నారు. సుమారు 200 ఎకరాల్లో విట్-ఏపీ ఏర్పాటైంది. అదేవిధంగా 100 ఎకరాల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్మించగా అందులో కూడా దాదాపు పది వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దీనికి సమీపంలోనే అమృత యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.
ఐదేళ్లుగా రాజధానిలో పనులు చేసేందుకు అనేక అవాంతరాలు ఏర్పాటు కావడంతో అమృత వర్సిటీ ప్రారంభం ఆలస్యమైంది. గత ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభించారు. అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీ కూడా రాజధానిలోనే ఏర్పాటైంది. అయితే ప్రభుత్వంపై నమ్మకంతో ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎత్తున సంస్థలు వచ్చినా, వాటికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ మినహాయిస్తే మిగిలిన విద్యాసంస్థలు రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పెడుతున్నారు.
ఏ విద్యాసంస్థకు వెళ్లాలన్నా ప్రైవేటు ఆటోలే గతి అవుతున్నాయి. వాటి చార్జీలు ఎక్కువగా ఉంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విద్యాసంస్థలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సౌకర్యం కలిగిస్తే మరింత ఆదరణ కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థలకు అదనంగా ఈ విద్యా సంవత్సరంలో బిట్స్ పిలానీ, ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లా కళాశాల, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్-సీఐఐ, టాటా గ్రూపు భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటీటివ్ నెస్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వీటిలో కొన్ని సంస్థలకు ఇప్పటికే ప్రభుత్వం భూమి కేటాయించిందని చెబుతున్నారు. ఇలా గత పదేళ్లలో ప్రైవేటు రంగం కాస్త పురోగతి సాధించినా, ఇంకా పూర్తిస్థాయిలో వృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో వచ్చే కొద్ది రోజుల్లో ప్రైవేటు విద్యాసంస్థలకు రవాణా సదుపాయం కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Social Plugin