AMARAVATHI: దాదాపు 85 రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు మరోమారు రిమాండ్ పొడిగించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఇంకా బ్యాడ్ టైమే నడుస్తోంది. దాదాపు 85 రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు మరోమారు రిమాండ్ పొడిగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి బెయిల్ వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఆశిస్తుండగా, కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీకి 14 రోజుల రిమాండ్ పొడిగించడంతో నిరాశ చెందుతున్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు ముదునూరు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వంశీ రిమాండు ముగియడంతో మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి మరో 14 రోజులపాటు రిమాండు పొగించారు. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం గంటపాటు సమయం ఇచ్చింది. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని నిందితుడు వంశీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కేసులో వంశీతోపాటు ఆయన అనుచరులు మరో ఐదుగురికి న్యాయస్థానం రిమాండు విధించింది. దీంతో నిందితులును మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో మరికొందరు అరెస్టు కావాల్సివుందని అంటున్నారు. వారు పట్టుబడే వరకు వంశీతోపాటు మిగిలిన నిందితులకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి బెయిల్ తెప్పించేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల అత్యావసర వైద్యం నిమిత్తం ఆస్పత్రికి కూడా తరలించారు. ఈ సమస్యను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లి మధ్యాంతర బెయిల్ అయినా తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రాసిక్యూషన్ పకడ్బందీగా వాదనలు వినిపిస్తుండటం వల్ల వంశీకి ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. ముఖ్యంగా కూటమి సర్కారు వంశీ విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహం చల్లారే వరకు వంశీకి బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని వంశీ కుటుంబ సభ్యులు తమ సామాజిక వర్గ పెద్దలను కోరుతున్నప్పటికీ, ఎవరూ సాహసించడం లేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై పరిధి దాటి వ్యాఖ్యలు చేయడం వల్ల వంశీ విషయంలో జోక్యం చేసుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీకి న్యాయస్థానాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. పోలీసుల విచారణ ముగిసేవరకు ఆయనను విడిచిపెట్టే అవకాశాలు లేవన్న ప్రచారం నడుమ ప్రస్తుతం పరారీలో ఉన్నవారు లొంగిపోతే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Social Plugin