ANDHRAPRADESH:రంగారెడ్డి జిల్లాలో సొంత అక్కను తమ్ముడే హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ దారుణం జరగగా.. తాజాగా ఓ అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు. ఫేమస్ కావాలనే లక్ష్యంతో రోహిత్ నేరానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొత్తూరు మండలం పెంజర్లలో రోహిత్ (20).. తన అక్క రుచిత (21)ను గొంతునులిమి హత్య చేశాడు. రుచిత స్థానిక యువకుడితో ఫోన్‌లో తరచూ మాట్లాడుతుందనే కారణంతో అక్కతో గొడవపడ్డాడు రోహిత్. ఈ విషయం తమ కుటుంబ పరువుని దిగజారుస్తుందంటూ ఘర్షణకు దిగాడు. అయినా రుచిత తన మాటలు లెక్కచేయకపోవడంతో.. రోహిత్ తీవ్ర ఆగ్రహంతో, ఆమె మెడను వైరుతో బిగించి హత్య చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో హింట్ ?
సంబంధిత ఘటనపై రుచిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హత్యకు కొద్దిరోజుల ముందు రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక రీల్ అప్‌లోడ్ చేశాడు. అందులో.. "బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా" అంటూ డైలాగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది.
ఇన్‌స్టా రీల్, హత్యకు ముందు ప్రవర్తన, సంఘటన తీరును పరిశీలించిన పోలీసులు.. ఇది ఉద్ధేశపూర్వకంగా ప్లాన్ చేసిన నేరమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతని ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లను ఫోరెన్సిక్‌కు పంపించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
Social Plugin