HYDERABAD:దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో హైదరాబాద్ మహానగరం ఒకటి. 2025లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో అంటే 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. అటు జనాభా పెరుగుదలతో పాటు నిత్యం అనేక సమస్యలతో భాగ్య నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి భాగ్య నగరంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కానుంది. ఏ సమస్య అయినా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు వాట్సాప్ నంబర్ ను ప్రకిటించారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. 7416687878 నంబర్‌కు ఫిర్యాదులు పంపితే, వాటిని స్వీకరించి, ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు.
భాగ్యనగరంలో ప్రస్తుతం జనాభా కోటీ 13 లక్షలుగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందు ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు సమర్పించేవాళ్లు. మహిళలు, దివ్యాంగులు అంత దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇక ఉద్యోగులు, కూలీలు అయితే పనులు మానుకుని కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు భాగ్య నగరంలో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టారు
హైదరాబాద్ ప్రజలు ఇకపై మరింత సులభంగా తమ ఫిర్యాదులను చేరవేసేలా.. జులై 28 నుంచి వాట్సాప్ ద్వారా ప్రజావాణికి దరఖాస్తులు స్వీకరించే అవకాశం కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందన సోమవారం తన అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించారు. 'హైదరాబాద్ పౌరులారా.. ఇప్పుడు పాలన మీ దగ్గరికి వస్తోంది' అని ఆమె ట్వీట్ చేశారు. 7416687878 నంబర్‌కు ఫిర్యాదులు పంపితే, వాటిని స్వీకరించి, ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తాజా కార్యక్రమంతో పౌరులు కలెక్టరేట్ కు వెళ్లకుండానే, తమ ఫిర్యాదులను 7416687878 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని స్పష్టం చేశారు. ఈ నంబర్ కు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఫిర్యాదు అందిన వారం రోజుల్లో తీసుకున్న చర్యల వివరాలను, సమాచారాన్ని తిరిగి వాట్సాప్ ద్వారానే తెలియజేస్తామని వివరించారు. తాజా నిర్ణయంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Social Plugin