Ticker

6/recent/ticker-posts

చంద్రబాబులో రెండో రూపం.. ఎమ్మెల్యేలు చేసిన పనికి సీఎం చేశారో తెలుసా?


ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మల వదనంతో కనిపించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం తెప్పించారు కూటమి ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు తూతూమంత్రంగా హాజరు కావడం, మధ్యలోనే వెళ్లిపోవడంపై సీఎం సీరియస్ అయ్యారు. సభా కార్యకలాపాలకు డుమ్మకొట్టడాన్ని తీవ్రంగా పరిగణించి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఇతర విప్ లను పిలిపించి మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యేలు అందరికీ ప్రభుత్వం నుంచి ఫోన్లు వెళ్లాయి. సభకు హాజరుకాకపోవడంపై కారణాలు చెప్పాలంటూ వివరణ అడిగినట్లు సమాచారం.

ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే యథావిధిగా ఈ సమావేశాలకు ప్రతిపక్షం హాజరుకాకపోవడంతో సభా కార్యక్రమాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. కూటమిలో 164 మంది ఉండగా, దాదాపు సగం మంది వరకు ఏ రోజు హాజరుకావడం లేదని చెబుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలు చర్చకు వచ్చిన సందర్భంలోనే ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. దీంతో అసెంబ్లీలో ఎప్పుడూ చూసినా సభ్యుల హాజరు పలుచగానే కనిపిస్తోంది.

ఇక ఈ వారం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు బిజీగా ఉండటం, ఆయన విశాఖ, పాలకొల్లు, తిరుపతి పర్యటనలకు వెళ్లడంతో సీఎం అసెంబ్లీకి రారు అన్న అంచనాతో చాలా మంది ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే హాజరుపై పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో దాదాపు 80 శాతం మంది గైర్హాజరు అవుతున్నారు. అయితే బుధవారం రాత్రి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి వచ్చేశారు. ఆయన అసెంబ్లీకి వచ్చే సమయానికి సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 24 మంది మంత్రులే ఉన్నారు. మంత్రుల్లో కొందరు మండలి సమావేశానికి వెళ్లగా, మరికొందరు మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే సభకు వచ్చినట్లు సీఎం గుర్తించారు. వెంటనే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును పిలిచి సభకు రాని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయాలని సూచించారు. దీంతో చీఫ్ విప్, విప్ లు అందుబాటులో ఉన్న 17 మంది ఎమ్మెల్యేలను వెంటనే సభకు రప్పించారు. రేపటి నుంచి ఎమ్మెల్యేల హాజరు పూర్తిస్థాయిలో ఉండేటట్లు చూడాలని సీఎం సూచించారు.