ఇప్పటివరకు 501 కోట్ల రూపాయల విలువైన 2. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం
390 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం
55 లక్షల గోనెసంచుల,1920 వాహనాలు వినియోగిస్తున్నాం
గోనెసంచుల, హమాలీలు, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం-
ఏలూరు: ప్రస్తుత రబీలో రైతుల నుండి ఇప్పటివరకు 501 కోట్ల రూపాయల విలువచేసే 2. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను బుధవారం తన ఛాంబర్లో పాత్రికేయుల సమావేశంలో జేసీ ధాత్రిరెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో తగినంత సాగునీరు అందుబాటులో ఉండడం, వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రస్తుత రబీలో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించామన్నారు. ప్రస్తుత రబీలో ఇంతవరకు 501 కోట్ల రూపాయల విలువైన 2. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి, 390 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, ధాన్యం సేకరణ చేసిన 48 గంటలలోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేశామని, అధిక శాతం మంది రైతులకు 24 గంటలలోగా సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో ఈ-క్రాప్ లో నమోదైన 78 వేల ఎకరాలలో 3. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. గత రబీలో 2. 06 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా, 2023 రబీలో 2. 16 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా ఉందన్నారు. అధిక దిగుబడి నిచ్చే రెండు వరి పంట రకాలు పి ఆర్ 126, ఎంటియు 1121 రకాలు 70 వేల ఎకరాలలో రైతులు వేశారన్నారు. జిల్లాలో 180 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో ప్రధానమైన గోనెసంచుల, హమాలీలు, రవాణా సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు.
ధాన్యం సేకరణ కేంద్రంలోను, మిల్లర్ల వద్ద తేమ శాతం కొలిచేందుకు ఒకేరకమైన యంత్రాలను వినియోగించిన కారణంగా తేమ శాతంలో వ్యత్యాసం సమస్య పూర్తిగా తొలగిపోయిందన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో 58 లక్షల గోనెసంచులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు నాణ్యమైన గోనెసంచులను అందించేందుకు గోనెసంచులను 3 దశలలో పరిశీలించామన్నారు. ముందుగా మిల్లర్లు పరిశీలించిన తరువాత మండల స్థాయిలో కస్టోడియన్ అధికారులు మిల్లర్ల దగ్గర పరిశీలిస్తారని, అనంతరం రైతు సేవా కేంద్ర వద్దకు గోనెసంచుల వచ్చినతరువాత వాటిని సంబంధిత రైతుల సమక్షంలో పరిశీలించి గోనెసంచుల నాణ్యతను సదరు రైతులు ధృవీకరిస్తారన్నారు.
హమాలీల సమస్య కూడా లేదన్నారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా 1920 వాహనాలను ధాన్యం రవాణాకు సిద్ధం చేశామన్నారు. అవసరమైతే మరిన్ని గోనెసంచుల, వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడా ధాన్యం దెబ్బతినలేదని, రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదన్నారు. 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యంగా ఎఫ్సీఐ కి నిర్ణయించామన్నారు. తాను పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో జిల్లాలోని ఏ ఒక్క రైతు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకున్నదన్నారు.
ధాన్యం అమ్మకంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ కు వచ్చే సమస్యలను పౌర సరఫరాలు, రెవిన్యూ, వ్యవసాయం, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరిస్తున్నారని జేసీ ధాత్రిరెడ్డి తెలియజేసారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శివ రామ్మూర్తి, డీఎస్ఓ ప్రతాపరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీ, ప్రభృతులు పాల్గొన్నారు.
Social Plugin