Ticker

6/recent/ticker-posts

అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఎదురుచూస్తున్నా... ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్

తన అరెస్ట్‌పై వస్తున్న వార్తలను ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎఫ్‌ఐఆర్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాఖ్య

దమ్ముంటే అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి బహిరంగ సవాల్

ఇదంతా ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపణ

నా అరెస్ట్‌తోనే మంత్రి కొల్లు రవీంద్రకు ఆనందం అంటూ విమర్శ

చట్టపరంగా ఎదుర్కొంటా, పారిపోయే ప్రసక్తే లేదని స్పష్టం

ANDHRAPRADESH:తన అరెస్ట్ గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, అలాంటప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు.

గురువారం మచిలీపట్నంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. "గత నెల రోజులుగా నన్ను అరెస్ట్ చేస్తారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. నేను పారిపోతాననే ఉద్దేశంతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. కానీ నేను ఎక్కడికీ వెళ్లను, ఇక్కడే ఉంటాను" అని ఆయన తేల్చిచెప్పారు. ఇది కేవలం పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారమని, వారి సునకానందం కోసమే ఇలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ప్రజల దృష్టిని మరల్చేందుకే (డైవర్షన్ పాలిటిక్స్) తన అరెస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్ని నాని ఆరోపించారు. స్థానిక మంత్రి కొల్లు రవీంద్రపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతుంటే రాని ఆనందం, నన్ను అరెస్ట్ చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర కళ్లలో కనిపిస్తుందట. ఇంతకంటే శాడిజం ఉంటుందా?" అని నాని ప్రశ్నించారు.

ఒకవేళ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, తాను చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో పోరాడి, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ వైఎస్ జగన్ జెండాను మోస్తానని అన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, బందరులో ఇచ్చిన ప్రతి పట్టా రికార్డులు ప్రభుత్వ వెబ్‌పోర్టల్‌తో పాటు అన్ని సంబంధిత కార్యాలయాల్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.