ఏలూరు జిల్లా, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏం సునీల్ కుమార్ (ఎఫ్.ఎ.సి) సూచనలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఈరోజు ఏలూరులోని జిల్లా కారాగారాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాల పైన ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత న్యాయ సేవాధికార సంస్థలకు ఉందని అందులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఖైదీలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన నీరు, ఆహారము అందించాలని అధికారులకు సూచించినట్లు, అవసరమైన పక్షములో ఖైదీల కుటుంబాలకు న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తామని తెలియజేశారు.
ఆర్థికంగా వెనుకబడి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా ఉచితముగా కేసులను వాదించడం జరుగుతుందని అలాగే ప్రతి వారంలో నాలుగు రోజులు పారా లీగల్ వాలంటీర్లు ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి ఆ వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలియజేస్తారని తద్వారా వారికి మరింత త్వరగా న్యాయ సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని కావున ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఖైదీలకు సూచించారు.
అలాగే అందుబాటులో ఉన్న ఖైదీల యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఎటువంటి న్యాయ సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ప్రత్యక్షంగా గాని 08812 22455 లేదా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలర్లు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటున్నారు.
Social Plugin