అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తొలి కోర్టు హాలులో ఉదయం 10.15 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు.
ప్రస్తుతం జస్టిస్ లీసా గిల్ హైకోర్టులో రెండో అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నూతన విధాన నిర్ణయాల ప్రకారం, భవిష్యత్తులో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తులను రెండు నెలల ముందుగానే బదిలీ చేసి కోర్టు వ్యవహారాలపై అవగాహన కల్పించే విధానం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఠాకూర్ రిటైర్మెంట్ అనంతరం జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ లీసా గిల్ నిలిచే అవకాశం ఉండటం విశేషం.
ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది తారక్ ప్రసాద్ చౌదరి జస్టిస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

