ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 09: ప్రస్తుత కాలంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని, దాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.
ఏలూరు పవర్‌పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం నిర్వహిస్తున్న హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత వ్యాక్సినేషన్ గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన, అనంతరం వ్యాక్సిన్ వైల్ మానిటర్ రంగును స్వయంగా పరిశీలించి వ్యాక్సిన్ స్థితిని తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను పవర్‌పేట యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమ్ రాజు ఎమ్మెల్యేకు వివరించారు.
తదనంతరం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఎమ్మెల్యే సమక్షంలో వైద్య సిబ్బంది హెచ్‌పివి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు రాకుండా ఉండేందుకు హెచ్‌పివి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా బయట రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చయ్యే ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్ధసారధి, కార్పొరేటర్ యర్రంశెట్టి సుమన్, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



.jpeg)