ఏలూరు, జూన్ 15: ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రానున్న ఐదు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ కాలంలో తీవ్రమైన ఎండలతో పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం రద్దీ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు, శీతలీకరణ కేంద్రాలు, నీడ కల్పించే షెల్టర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే వేడిగాలులకు గురైన వారికి వెంటనే వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు.
జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కోరారు.

