ఏలూరు, జూన్ 15: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఆధీనంలోని ఉండి మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డై. ఎంపీడీవో)గా విధులు నిర్వహిస్తున్న సి.హెచ్. వెంకటరెడ్డికి పదోన్నతి లభించింది. ఆయనను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పదోన్నతి కల్పిస్తూ కొవ్వూరు మండలానికి నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఎంపీడీవోలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు.
పదోన్నతి పొందిన వెంకటరెడ్డి తన అనుభవం, నిబద్ధతతో కొవ్వూరు మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పి. జగదాంబ, పరిపాలనాధికారి కె.వి. జాన్సన్ పాల్గొని వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

