ఏలూరు, జూలై 12: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని కోరుతూ ఆదివారం ఏలూరులోని తూర్పు వీధి శ్రీ దాసాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు నిమ్మల జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నాయకుడు నారా శేషు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, పవన్ కళ్యాణ్‌కు శనివారం నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడం సంతోషకరమని అన్నారు. దాసాంజనేయస్వామి ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకుని ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు.
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం కృషి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. దశాబ్ద కాలానికి పైగా భుజం నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను, పార్టీ సిద్ధాంతాల సాధనను కొనసాగించడం ఆయన అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్స అనంతరం మరింత ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి వస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన నగర అధ్యక్షుడు వీరంకి పండు, నాయకులు కోయ సత్తిబాబు, రెడ్డి గౌరీశంకర్, దోసపర్తి రాజు, 7వ డివిజన్ నాయకులు కొమ్మన శ్రీకాంత్, శంకర్, ముమ్మాల శ్రీను, టీడీపీ నాయకులు రాజా మురళి, నరేంద్రతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

