ఏలూరు, జూలై 12: తాండ్ర పాపారాయుడు సెంటర్‌లోని వెలమ రామాలయం ఆవరణలో ఆదివారం వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు)కు ఘన అభినందన, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కె.ఎల్.ఎన్. ధనకుమార్ అధ్యక్షత వహించగా, శ్రీ నూకాలమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు చేస్తున్న కృషిని అభినందించారు. వెలమ సంక్షేమ సంఘం సభ్యులు, తాండ్ర పాపారాయుడు యూత్ సభ్యులు, డ్వాక్రా సంఘాల మహిళలు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు తమ అభినందనలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు.
అనంతరం డాక్టర్ రాజాన సత్యనారాయణను పూలమాలలు, పూలబొకేలు, దుశ్శాలువాలు, పూల కిరీటం, గజమాలతో ఘనంగా సత్కరించారు. వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, సభాధ్యక్షుడు బ్రహ్మశ్రీ కె.ఎల్.ఎన్. ధనకుమార్ తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు.
సన్మానానికి స్పందించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో పాటు ప్రజల సహాయ సహకారాల వల్లే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టగలిగానని, భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం సభ్యులు, తాండ్ర పాపారాయుడు యూత్ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆహూతులకు తేనీటి విందు ఏర్పాటు చేసినట్లు చిటికెన రాంబాబు తెలిపారు.

