అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, జూన్ 15: ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆమె జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక దివ్యాంగుడి వద్దకు స్వయంగా వెళ్లి అర్జీని స్వీకరించి, అతని సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి డీఆర్‌వో ఎల్. దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకే సమస్యపై పునరావృతంగా ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన తాడిశెట్టి వెంకన్న తన కుమారుడు తన అర ఎకరం పంట భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని, జీవనోపాధి కోల్పోయానని న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన అల్లం నర్సుల లక్ష్మి తన పంట భూమి ఆక్రమణకు గురైందని, సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకటరమణ చేపల చెరువు లీజుదారు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో పాటు చెరువును స్వాధీనం చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
కైకలూరు ప్రాంతానికి చెందిన మారిశెట్టి లక్ష్మి తమ ప్రాంతంలో రహదారులు ఆక్రమణలకు గురవడంతో పాటు డ్రైనేజీలు మూసుకుపోయాయని, విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని కోరగా, కీర్తి వెంకట రామ్ ప్రసాద్ కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి ప్రాంతాల్లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
_11zon.jpeg)
