జెసిబి వినియోగంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
ఏలూరు, జూన్ 15: మైసన్నగూడెం గ్రామంలోని నూకాలమ్మ చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో యంత్రాలను వినియోగిస్తున్నారని, దీనివల్ల సుమారు 300 మంది ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ జెసిబి, ట్రాక్టర్లతో పనులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు ప్రారంభమైనప్పటికీ, నూకాలమ్మ చెరువు ప్రాంతంలో యంత్రాలతో మట్టి తరలింపు, లోతుగా గుంతలు తీయడం వంటి పనులు జరుగుతున్నాయి. సుమారు ఆరు నుండి ఎనిమిది అడుగుల లోతు వరకు గుంతలు తవ్వడంతో కూలీలకు పని దొరకకుండా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
యంత్రాల వినియోగాన్ని అడ్డుకునేందుకు ఉపాధి కూలీలు జెసిబి వాహనాలను నిలిపివేసినట్లు సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి యంత్రాలపై సుమోటోగా కేసులు నమోదు చేసి, చట్టవిరుద్ధంగా జరుగుతున్న పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా యంత్రాల వినియోగం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు.
ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని కూలీలు హెచ్చరించారు. గతంలో కూడా ఈ చెరువు లీజు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, నీటిపారుదల సంఘం పేరుతో కొందరు లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు.
ఉపాధి హామీ పనులు మానవ శ్రమ ఆధారంగానే జరగాలని, యంత్రాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ, పని ప్రదేశాల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి తమకు పని భద్రత కల్పించాలని కూలీలు అధికారులను కోరారు.

