“మా బంగారం మాకు ఇప్పించండి” అంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
ఏలూరు, జూన్ 15: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ‘చలో ఏలూరు కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ బంగారం తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితులు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బాధితులు “మా బంగారం మాకు ఇప్పించండి” అంటూ నినాదాలు చేశారు. గోల్డ్ లోన్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, కుటుంబ మరియు వ్యవసాయ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం స్థానంలో ఇనుప వస్తువులు, సుద్ద ముక్కలు వంటి వస్తువులు ఉన్నాయని ఆరోపిస్తూ, ఇది పెద్ద స్థాయి గోల్‌మాల్‌గా అనుమానం వ్యక్తం చేశారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం శాఖలో సుమారు 2,600 ఖాతాలు ఉండగా, ఇప్పటివరకు 1,600 ఖాతాలే విచారణకు వచ్చాయని, మిగతా ఖాతాలపై వెంటనే విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 82 ఖాతాల్లో 4 కేజీలకు పైగా బంగారం మిస్సింగ్‌గా ఉన్నట్లు ఆరోపిస్తూ, మొత్తం 15 కేజీల వరకు బంగారం తేడా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు మాట్లాడుతూ బాధితులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బ్యాంక్ భద్రతా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, తక్షణమే పారదర్శక విచారణ జరపాలని కోరారు.
ధర్నా అనంతరం బాధితులు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్, గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం జరిగేలా బ్యాంక్ ఉన్నతాధికారులతో సమన్వయం చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించినట్లు సమాచారం. సమగ్ర విచారణ కొనసాగుతోందని, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన గోల్డ్ లోన్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

