ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని పి.ఓ.డబ్ల్యు డిమాండ్
పలాస, జూన్ 15: మహిళల స్వేచ్ఛను హరించే విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) శ్రీకాకుళం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద, అలాగే మాకనపల్లి గ్రామంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
ధర్నా అనంతరం పలాస ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీమతి భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించేందుకు ఒబీసీ, మైనారిటీ మహిళలకు సబ్‌కోటాలతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
గ్రామీణ పేదల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను వెంటనే విరమించుకోవాలని వారు కోరారు. నిధుల కోతలు, పని దినాల తగ్గింపు, వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిలిపివేసి ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అలాగే మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూపించే విధానాలు, ప్రోత్సాహక ప్రకటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పిల్లల సంఖ్య ఆధారంగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం మహిళల స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. మహిళలకు ఎన్ని పిల్లలు కనాలన్నది వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు.
పై అంశాలపై తగిన చర్యలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బతకల ఈశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, కోశాధికారి బర్ల జానకమ్మ, కమిటీ సభ్యులు లత, గీతతో పాటు మాకనపల్లి గ్రామానికి చెందిన జానకి, హేమక్క, సావిత్రమ్మ, డిల్లమ్మ, ఇందిరా, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

