తిరుపతి/చింతలపూడి, జూన్ 12: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తిచేసుకుని విజయవంతంగా మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. హైకమాండ్ పిలుపు మేరకు ఒక రోజు ముందుగానే తిరుపతికి చేరుకున్న ఆయన, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సభలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేదికపై ఆసీనులైన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని అభివాదం చేశారు. సభలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
సభ అనంతరం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం 18 నెలల వ్యవధిలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మహిళలు, రైతులు, యువత సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రోషన్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

