Ticker

6/recent/ticker-posts

విమల విద్యాలయానికి పునర్జీవం.. ఉక్కునగర ప్రజల కల సాకారం: పల్లా శ్రీనివాసరావు


విశాఖపట్నం, జూన్ 12: ఉక్కునగర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ విమల విద్యాలయం పునరుద్ధరణతో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయ కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే Palla Srinivasa Rao పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన విమల విద్యాలయం మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపడం హర్షణీయమన్నారు.


విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా కొనసాగించే నిర్ణయం అనంతరం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావుతో కలిసి పాఠశాలను సందర్శించిన పల్లా శ్రీనివాసరావు విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యా బోధన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.

విమల విద్యాలయం సమస్య పరిష్కారం కోసం గత ఏడాది కాలంగా నిరంతరంగా కృషి చేసినట్లు పల్లా తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి H. D. Kumaraswamy హెచ్.డి. కుమారస్వామిని పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించడంతో పాటు, ఎంపీ Sri Bharat శ్రీభరత్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏడాది కాలంలో 30కి పైగా వినతిపత్రాలు సమర్పిస్తూ పరిష్కారం కోసం కృషి చేసినట్లు వెల్లడించారు.

ఈ సమస్యను ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి Nara Lokesh నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించారని పల్లా తెలిపారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని విద్యార్థుల చదువులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేయడం ద్వారా విమల విద్యాలయం పునరుద్ధరణకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు.

విమల విద్యాలయం పునరుద్ధరణ కేవలం ఒక పాఠశాల కొనసాగింపుకు సంబంధించిన అంశం కాదని, ఉక్కునగర ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయ కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించిన చారిత్రాత్మక నిర్ణయమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ నిర్ణయంతో 32 మంది బోధనా, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత లభించడంతో పాటు, వందలాది మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తు సురక్షితమైందన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్లు పొందడం ఈ విద్యాసంస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో విమల విద్యాలయం మరింత అభివృద్ధి చెంది గాజువాక ప్రాంతంలో నాణ్యమైన విద్యకు మరోసారి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించిన పల్లా శ్రీనివాసరావు, ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఎంపీ శ్రీభరత్, జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, విశాఖ ఉక్కు పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.