ఏలూరు, జూన్ 12: బాల కార్మిక వ్యవస్థ సమాజానికి ఒక శాపమని, దీనిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో బాల కార్మిక నిర్మూలనపై ముద్రించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, వారి భవిష్యత్తును కాపాడడం సమాజం బాధ్యత అని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించే దిశగా అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు.
బాల కార్మిక నిర్మూలన కోసం జిల్లా టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్) కమిటీకి చెందిన అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. బాల కార్మిక నిషేధ చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, బాల కార్మికులను గుర్తించే చర్యలను మరింత ముమ్మరం చేయాలని అన్నారు.
ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ **1098**కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారం, అధికారుల సమిష్టి కృషితోనే బాల కార్మిక రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్ పి. శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్మన్ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద, సహాయ కార్మిక కమిషనర్ జి. నాగేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ పంకజ్ కుమార్, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, క్రాఫ్ (CRAF) స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

