ఏలూరు, జూన్ 15: ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు నవధాన్యాల విత్తనాలతో విత్తన గుళికలు (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ విత్తన గుళికల తయారీ, వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజనల్ ఇన్‌చార్జి ఎన్‌ఎఫ్‌ఏ నవీన మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తగా విత్తన గుళికల తయారీ చేపట్టాలని సూచించారు. నవధాన్యాల విత్తనాలను గుళికల రూపంలో తయారు చేసి పొలాల్లో వెదజల్లడం వల్ల అవి సుమారు ఆరు నెలల వరకు సురక్షితంగా నిల్వ ఉండటమే కాకుండా, అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మెరుగైన మొలకలు అందిస్తాయని వివరించారు.
రైతుల సమక్షంలో విత్తన గుళికల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించిన అనంతరం, రైతులతో కలిసి పొలాల్లో విత్తన గుళికలను చల్లారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ వ్యయంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రకృతి వ్యవసాయానికి ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
నవధాన్యాల సాగు ద్వారా భూసారం పెంపొందించడంతో పాటు వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఎఫ్ జ్ఞానాంబిక, ఎఫ్‌ఎమ్‌టీ వెంకటలక్ష్మి, ఐసీఆర్‌పీలు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

