ఏలూరు, జూన్ 15: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక ట్రాఫిక్ అమలు డ్రైవ్ నిర్వహించారు. ఏలూరు పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
జూన్ 1 నుంచి జూన్ 14 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 23 కొత్త కేసులు నమోదు చేశారు. గతంలో నమోదైన 5 కేసులతో కలిపి మొత్తం 28 కేసులకు సంబంధించి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు.
ఈ కేసులపై విచారణ చేపట్టిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రావూరి మురళీకృష్ణ, మొత్తం 28 మంది నిందితులకు కలిపి రూ.1,61,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

