INDIA, KARNATAKA, KOLURU, JUN 05: కర్ణాటకలోని కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక.. జీవితంపై ఆశ కోల్పోయి ఇద్దరు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా చింతలహళ్లి జోడి గ్రామంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన బుజ్జి, బాబు దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటకలోని కోలారు జిల్లాకు వలస వచ్చారు. అక్కడ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు సరస్వతి (4), కుమారుడు హేమశ్రీ (15 నెలలు) ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆ కుటుంబంలో పెద్ద విషాదం నిండింది. గత నెల 10వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భర్త బాబు మృతి చెందాడు. కట్టుకున్న భర్త హఠాన్మరణంతో భార్య బుజ్జి తీవ్ర మనస్తాపానికి గురైంది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని వెళ్లదీయడం భారంగా భావించింది. భర్త లేని జీవితంపై భరోసా కోల్పోయిన బుజ్జి.. పిల్లలతో సహా చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకూతురు సరస్వతి, పసికందు హేమశ్రీలకు ఊపిరి ఆడకుండా చేసి మంచంపైనే చంపేసింది. బిడ్డలిద్దరూ చనిపోయాక బుజ్జి కూడా ఇంట్లోనే ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే లోపలికి వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్న పిల్లలను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. నిందితురాలు బుజ్జిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త చనిపోయిన నెల రోజులకే ఇద్దరు పసిబిడ్డలు కూడా తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

