Ticker

6/recent/ticker-posts

పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం


TELANGANA, HYDERABAD, JUN 05: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగు, తాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదొక చారిత్రాత్మక రోజని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను, పనులను సంపూర్ణంగా సమకూరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పనులను మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే జిల్లా ప్రజలు మనల్ని క్షమించరని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరు దశ రాబోయే ఐదేళ్లలో పూర్తిగా మారబోతోందని, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని భరోసా ఇచ్చారు.


కర్ణాటకతో కార్యాచరణ.. గూడెందొడ్డిలో 15 టీఎంసీల నీరు
ప్రాజెక్టుల వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గూడెందొడ్డి రిజర్వాయర్‌లో 15 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక బ్రిడ్జి బ్యారేజీలు కట్టుకుంటూ దాదాపు వంద టీఎంసీల నీటిని నిలుపుకుందని గుర్తుచేశారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి తాము కార్యాచరణ రూపొందిస్తామని, ఖర్చులు కూడా పంచుకుంటామని వెల్లడించారు. గతంలో నికర జలాలతో 7.5 టీఎంసీల నీటిని వాడుకునేలా తామే జీవో తెచ్చామని, కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టులు తొక్కిపెట్టబడ్డాయని మండిపడ్డారు. ప్రస్తుతం సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా లెక్కలు కడుతున్నట్లు వివరించారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల వంటి భారీ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే కట్టబడ్డాయని సీఎం గుర్తుచేశారు. కేసీఆర్ కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులేవీ లేవని, కేవలం దోపిడీ చేయడమే ఆయనకు తెలుసని ధ్వజమెత్తారు. “జిల్లా అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అడ్డుపడకుంటే చాలు. కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. కేసీఆర్‌కు ఊడిగం చేస్తూ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు” అని సీఎం ఘాటుగా హెచ్చరించారు.

పదేళ్లలో ఇరిగేషన్ సెక్టార్ ధ్వంసం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 జూన్ 2 నుండి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, ఆ అప్పుల భారంతోనే ఇప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోందని అన్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశామంటూ గత పాలకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో నీళ్లు ఆయకట్టుకు రావడం లేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుండి శ్రీశైలంకి మార్చడం గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదమని విమర్శించారు. దీనివల్ల రూ. 27,000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.

గత పదేళ్లలో కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను కూడా పెండింగ్‌లో పెట్టి ధ్వంసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల హక్కుల కోసం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అత్యంత సమర్థవంతంగా పోరాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా నీళ్లను ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్
తమ హయాంలోనే పంటలు బాగా పండాయని, రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్‌లో దేశంలోనే రికార్డు స్థాయిలో 71.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. గతంతో పోలిస్తే తెలంగాణలో 60 శాతం కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరించామని వివరించారు. వరి ఉత్పత్తి (Rice Production) , ధాన్యం సేకరణ (Procurement) లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా గర్వంగా ప్రకటించారు.