ఏలూరు, జూన్ 12: ఈ నెల 19వ తేదీన పట్టిసీమలో నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన పట్టిసీమలో పెద్ద ఎత్తున యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున కార్యక్రమాన్ని ఉదయం వేళల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పాల్గొనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీడ ఉన్న ప్రాంతాల్లో వేదికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించి, అవసరమైన అన్ని మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు.
జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ సూచించారు. గ్రామ స్థాయి పోటీలు పూర్తయ్యాయని, మండల స్థాయి పోటీలను కూడా త్వరితగతిన పూర్తి చేసి విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపాలని ఆదేశించారు. డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు యోగాంధ్ర యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, ఫోటోలను యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, స్వర్ణ గ్రామ-వార్డు సచివాలయాల అధికారి జి. వెంకటనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

