Ticker

6/recent/ticker-posts

ఏలూరులో రహదారి భద్రతకు ఆశ్రం హాస్పిటల్ చేయూత


పోలీస్ శాఖకు 20 ట్రాఫిక్ బారికేడ్ల అందజేత

ఏలూరు, జూన్ 13: జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆశ్రం మెడికల్ కాలేజీ మరియు ఆశ్రం హాస్పిటల్ యాజమాన్యం పోలీస్ శాఖకు 20 ట్రాఫిక్ బారికేడ్లను అందజేసింది. ఈ బారికేడ్లను ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్‌కు ఆశ్రం హాస్పిటల్ ప్రతినిధులు శుక్రవారం అందించారు.

నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలు సంభవించే కూడళ్ల వద్ద ఈ బారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగస్వాములు కావడం ఆశ్రం హాస్పిటల్ యాజమాన్యం సామాజిక బాధ్యతను చాటుతోందన్నారు. ప్రజా భద్రతకు తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

మెడికల్ కాలేజీ, హాస్పిటల్ యాజమాన్యం పోలీస్ శాఖతో కలిసి పనిచేయడం వల్ల ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన పెరుగుతుందని ఆశ్రం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు పోలీస్ శాఖ, ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రం హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కె. హనుమంతరావు, ఆశ్రం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చి. శ్రీనివాస్, ఆశ్రం హాస్పిటల్ ఇన్‌చార్జి ఎమర్జెన్సీ డాక్టర్ ప్రణయ్ కృష్ణ, జనరల్ మేనేజర్ బాల రాజశేఖర్ (కెన్న) తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణలో పోలీస్ శాఖకు సహకరించిన ఆశ్రం సంస్థ యాజమాన్యానికి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు ఆకాంక్షించారు.