Ticker

6/recent/ticker-posts

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై వన్‌టౌన్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు


మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ హెచ్చరిక

ఏలూరు, జూన్ 13: ఏలూరు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి వేళల్లో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక గస్తీ, వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్సై సుధాకర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జూన్ 12/13 అర్ధరాత్రి వేళల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మర గస్తీ నిర్వహించిన పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వారికి గౌరవ న్యాయస్థానం ద్వారా రూ.10 వేల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని వివరించారు. యువత అవసరం లేకుండా అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై గుంపులుగా తిరగవద్దని సూచించారు. సహేతుకమైన కారణం లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్సై సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం వన్‌టౌన్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.