ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని యూనియన్ పిలుపు
ఏలూరు, జూన్ 13: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏలూరు నగర సమితి సమావేశం బంగారు అక్కమ్మ అధ్యక్షతన సీపీఐ జిల్లా కార్యాలయం ‘స్ఫూర్తి భవన్’లో నిర్వహించారు.
ఈ సమావేశంలో భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశుధ్య, ఇంజినీరింగ్ విభాగాలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో జీవిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరణించిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
పర్మినెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఏలూరు నగర కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీల బదిలీలు చేపట్టాలని కోరారు.
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భీమవరంలో జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు జూన్ 20 నుంచి జూలై 7 వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు ఉప్పులూరి హేమశంకర్, నగర కార్యదర్శి దడ్డికర్ల నాగబాబు, యాలగాడ శివకుమార్, అంతరాజు కిరణ్, పైడారి వంశీ, బంగారు గురుప్రసాద్, మరియదాసు, రాఘవులు, దేవి, అల్లం పెద్దిరాజు, గోవాడ మల్లేశ్వరరావు, బంగారు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

