Ticker

6/recent/ticker-posts

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీకి చర్యలు తీసుకోవాలి


విశాఖపట్నం, జూన్ 15: అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు స్కూల్, కళాశాల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించేందుకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కలెక్టర్‌ను కలిసి జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలను వివరించాయి. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

గతంలో 2014 నుంచి జర్నలిస్టుల పిల్లలకు కొన్నిసార్లు 100 శాతం, మరికొన్నిసార్లు 50 శాతం ఫీజు రాయితీ అమలులో ఉన్న విషయాన్ని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం, ఈ ఏడాదికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వెంటనే జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుదారులైన వెటరన్ జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ప్రీమియం సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా చెల్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. పెన్షన్ సదుపాయం, ప్రమాద బీమా పునరుద్ధరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, ఉపాధ్యక్షులు శివప్రసాద్, నగేష్, కృష్ణమూర్తి, బ్రాడ్‌కాస్ట్ విభాగం అధ్యక్షుడు ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, స్మాల్ పేపర్స్ అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాసరావు సహా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.