ఏలూరు, మే 11: కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్వాగతించింది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించి వేగవంతమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, కళ్ళచెరువు గ్రామంలోని “ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం” నిర్వహిస్తున్న చవటపల్లి రాంబాబు @ హోసన్నా అనే వ్యక్తి, బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు చెబితే ప్రాణహాని కలిగిస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తడికలపూడి మహిళా ఎస్ఐ ఎస్. వల్లీ పద్మ POCSO Act సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీ SCPCR జోక్యంతో పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి, POCSO చట్టంతో పాటు BNS చట్టంలోని సెక్షన్ 64(2)(m), 64(2)(f), 351(2) కింద కూడా కేసులు నమోదు చేశారు.
కమిషన్ బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలలపై లైంగిక దాడులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా వంటి అంశాలపై కమిషన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపింది.
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని కమిషన్ పేర్కొంది. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే బాలల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, సమాజంలో నమ్మకం పొందిన వ్యక్తుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ సందర్భంగా మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అధికారులు బి. సుజాత రాణి, ఐసిడిఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్యచక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ నిర్మల, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, తడికలపూడి ఎస్ఐ పద్మవల్లి తదితరులు పాల్గొన్నారు.

