ఏలూరు, మే 11: దెందులూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి హైవే సమస్యలపై చర్చించారు.
జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి ఆర్.కే. సింగ్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కలెక్టర్, దెందులూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి దారుణ స్థితిలో ఉండటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొవ్వలి, దెందులూరు, ఆశ్రమ్ ఆసుపత్రి, గరుడ హోటల్, కలపర్రు తదితర ప్రాంతాల్లో రోడ్లను తక్షణమే మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. హైవే సమీప గ్రామాల వద్ద బ్రిడ్జిలకు వీధిదీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారి డివైడర్‌లో మొక్కలు నాటినా వాటి నిర్వహణ సరిగా లేక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లు నిర్వహణ పనులు సక్రమంగా చేయకపోయినా షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు బిల్లులు చెల్లిస్తున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో హైవే ప్రమాదకరంగా మారిందన్నారు. రహదారి భద్రత సమావేశాలు, డీఆర్సీ సమావేశాల్లో పలుమార్లు సమస్యను ప్రస్తావించినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. రహదారి నిర్మాణం చేపట్టిన వరహా కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డివైడర్‌లో మొక్కల పెంపకం, నిర్వహణ కోసం బోర్లు ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్‌తో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే సత్యనారాయణపురం వద్ద గుండేరు డ్రైన్‌కు అవుట్‌ఫ్లో సౌకర్యం లేక రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయని, డ్రైన్‌పై ఉన్న ఎనిమిది కల్వర్టులను మరమ్మత్తు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ పీడీ విజయసాగర్, కలెక్టరేట్ సిబ్బంది పోతురాజు, వరహా కంపెనీ ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

