Ticker

6/recent/ticker-posts

బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా బడిలోనే ఉండాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, మే 11: బడి ఈడు వచ్చిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పూర్తి చేసిన 5 సంవత్సరాల వయస్సు దాటిన 7,600 మంది చిన్నారులను పాఠశాలల్లో చేర్పించినట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారని అన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 3,929 మంది మాత్రమే చేరినట్లు డీఈఓ నివేదించడంతో మిగిలిన పిల్లలు ఎక్కడ చేరారనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు.

ప్రైవేట్ పాఠశాలల్లో చేరినట్లు అధికారులు తెలియజేయడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ పూర్తి చేసిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన పిల్లల వివరాలను ఐసిడిఎస్ అధికారులు ధృవీకరించాలని ఆదేశించారు. పిల్లలు పాఠశాలలో చేరకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సుశిక్షిత ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారాలు, డిజిటల్ క్లాస్‌రూములు, ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా మైదానాలు వంటి సదుపాయాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా మెగా డ్రైవ్ నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎస్ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పీడీ శారద, ఎంఈఓలు, సీడీపీఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.