ఏలూరు, మే 11: NH-365BG గ్రీన్‌ఫీల్డ్ హైవే పై రహదారి ప్రమాదాల నివారణకు ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర నిఘా కొనసాగుతోంది.
చింతలపూడి ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది హైవేపై క్షేత్రస్థాయిలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. రేచర్ల గ్రామం వద్ద అంబులెన్స్ డ్రైవర్లతో సమావేశమై “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే సందేశంతో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
హైవేపై వాహనాలు అక్రమంగా నిలిపివేయకుండా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను వెంటనే తొలగించి వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలను నివారిస్తున్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద పరిస్థితులపై వెంటనే స్పందిస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందించేలా పోలీసు అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ రహదారి నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా హైవేలపై అతివేగంగా ప్రయాణించవద్దని, రాత్రిపూట ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల భద్రతా చర్యలకు వాహనదారులు సహకరించాలని కోరారు.
సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పెట్రోలింగ్ సమన్వయంతో గ్రీన్‌ఫీల్డ్ హైవేను ప్రమాద రహిత రహదారిగా తీర్చిదిద్దేందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.

