ఏలూరు, మే 11: స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్‌కు వచ్చిన ప్రజలకు చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గోదావరి సమావేశ మందిరం ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొని అర్జీదారులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, సేవా కార్యక్రమాలను మంచి అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ముందుకు వచ్చే సంస్థలు మరింత ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షులు పి. దేవరాజు, గౌరవ అధ్యక్షులు ఏ. కృష్ణ భాస్కర్, కార్యదర్శి కె. ఏసుబాబు, కమిటీ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

