ఆంధ్రప్రదేశ్, ఏలూరు, మే 11: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం “సమ్మర్ క్యాంప్” చిన్నారులను ఆకట్టుకుంటోంది. పుస్తక పఠనం నుంచి డిజిటల్ లెర్నింగ్ వరకు విభిన్న కార్యక్రమాలతో శిక్షణ తరగతులు ఉల్లాసంగా కొనసాగుతున్నాయి.
ఉదయం 8 గంటల నుంచి గ్రంథాలయ సిబ్బంది చిన్నారులకు దేశ నాయకుల జీవిత చరిత్రలు, శాస్త్రవేత్తల కథలు, నీతి కథల పుస్తకాలను చదివిస్తూ పఠనంపై ఆసక్తి పెంచుతున్నారు. అనంతరం క్యారమ్స్, వైకుంఠపాళి, లూడో, చెస్ వంటి వినోదాత్మక ఆటలతో చిన్నారులను అలరించారు.
ఉదయం 9 గంటలకు ఆంధ్రా డైరీ స్టాఫ్ రిపోర్టర్ చలసాని వెంకట సురేంద్ర రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని డిజిటల్ లెర్నింగ్ ద్వారా లిసనింగ్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారు. ల్యాప్‌టాప్ సహాయంతో దినపత్రికలు, సాయంకాల పత్రికలు, పక్ష పత్రికలు, మాసపత్రికల గురించి వివరిస్తూ గ్రంథాలయాల్లో లభించే సమాచారంపై అవగాహన కల్పించారు.
ఒక బాలుడు రోడ్డుపై పడిన భారీ మొక్కను తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని వీడియో ద్వారా చూపిస్తూ “ఐకమత్యమే మహాబలం” అనే సందేశాన్ని చిన్నారులకు అందించారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నీతి కథల ద్వారా వివరించారు.
అనంతరం రిసోర్స్ పర్సన్ సిహెచ్ పద్మావతి “ఇద్దరు అన్నదమ్ముల కథ” అనే నీతి కథను బోధించారు. కథ ముగిసిన తర్వాత కథ పేరును గుర్తించిన చిన్నారులకు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. శేఖర్ బాబు చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులు, స్కెచ్ పెన్నులు, స్నాక్స్ బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్యాస్ ఫెడరేషన్ అధ్యక్షురాలు గుడిమెట్ల అచ్యుత, గుడిమెట్ల సత్యదేవ్, అమెరికాలోని సొలాస లక్ష్మీ ప్రసాద్, ఝాన్సీ దంపతుల తరఫున చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు.
తరువాత సీనియర్ రిసోర్స్ పర్సన్ డి. శ్రీవల్లి చిన్నారులతో సరదా గేమ్స్ నిర్వహించి బ్రెయిన్ వ్యాయామాలు చేయించారు. పేపర్ క్రాఫ్ట్స్ ద్వారా ఆకర్షణీయమైన బొమ్మలు తయారు చేసే విధానాన్ని నేర్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు, గ్రంథాలయ సిబ్బంది బి. రమేష్ బాబు, ఎండి. అస్లాం పాషా, బీవీఎస్ లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

