Ticker

6/recent/ticker-posts

రహదారి ప్రమాదాల నివారణకు సమిష్టి కృషి అవసరం: కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జూన్ 26: రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్, సీటుబెల్ట్ ధారణ వంటి భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు, వీధి దీపాలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులను తరలించే వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.

భారీ వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఫ్లాష్, డాజిలింగ్ లైట్ల వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వాటిని నియంత్రించాలని సూచించారు. అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదాల్లో గాయపడిన వారికి వెంటనే వైద్యసేవలు అందించేందుకు రూపొందించిన పీఎం రాహత్ మరియు ఈడార్ (eDAR) యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నిబంధనల అమలులో భాగంగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై పోలీసు శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట (గోల్డెన్ అవర్)లో చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అందువల్ల ప్రమాదాల ప్రదేశాలకు సమీపంలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో అదనపు ఎస్పీ వై. ప్రసాదరావు, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్.కె. కరీం, ఆర్ అండ్ బి ఎస్‌ఈ కె. విజయరత్నం, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యు. శోభ, మున్సిపల్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.