Ticker

6/recent/ticker-posts

ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి


ఆంధ్రప్రదేశ్, ఏలూరు, మే 14: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్. శ్రీలక్ష్మి గురువారం ఏలూరులోని పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు ఈ పర్యటన నిర్వహించారు.


ముందుగా శనివారంపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఆమె, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రతపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న బాలలకు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు.

తదనంతరం శ్రీరామనగర్ 6వ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయం లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను పరిశీలించారు. క్లినిక్ పనితీరు, మాజీ సైనికులకు అందుతున్న న్యాయ సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని సూచించారు.

అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించి ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఖైదీలతో మాట్లాడిన ఆమె, న్యాయవాదిని నియమించుకోలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదులను నియమించి కేసులు వాదిస్తున్నామని తెలిపారు.

అలాగే ఖైదీల కుటుంబ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే కూడా న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.