ఆంధ్రప్రదేశ్, దెందులూరు, మే 14: దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వచ్ఛందంగా తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వ్యక్తిగతంగా చర్యలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కూడా పొదుపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే చింతమనేని ప్రభాకర్ తన కాన్వాయ్‌ను కుదిస్తూ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రత్యేకంగా మోడిఫై చేయించుకున్న Toyota Fortuner Legender కారును పక్కనపెట్టి సాధారణ స్పేర్ కారులో అధికారిక పర్యటనలకు వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. గురువారం ఉదయం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ముగిసిన అనంతరం ఆయన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించారు.
“నాయకుడు అంటే చెప్పడం కాదు.. చేసి చూపించాలి” అనే భావనతో ఇంధన పొదుపు చర్యల్లో ముందుండటం ఆయన నిబద్ధతకు నిదర్శనమని కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ సంస్కరణల అమలులో కూడా చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.
ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేస్తూ దేశ ప్రయోజనాల్లో భాగస్వాములు కావాలని కూటమి నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.

