Ticker

6/recent/ticker-posts

జలధార–జలహారతితో చెరువుల అభివృద్ధి వేగవంతం


ఆంధ్రప్రదేశ్, ఏలూరు, మే 14: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార–జలహారతి” కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలో జల సంరక్షణ పనులు వేగం అందుకుంటున్నాయి. కురిసే ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో చెరువులు, కాల్వలు, డ్రైన్లు, చానెళ్ల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.


ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల లక్ష్యంతో పూడికతీత, గట్టు బలోపేతం, నీటి నిల్వ సామర్థ్య పెంపు వంటి పనులను అధికారులు వేగంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.

దెందులూరు మండలం మసీదుపాడు గ్రామంలోని తామర చెరువు, అమ్మ చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. తామర చెరువులో పూడిక తొలగించి గట్లను పటిష్టం చేయడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ పనుల ద్వారా పరిసర ప్రాంత రైతులకు సాగునీరు అందడంతో పాటు గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తగ్గే అవకాశం ఉందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు చెరువులను పునరుద్ధరించడం గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

“జలధార–జలహారతి” కార్యక్రమం ద్వారా తామర చెరువు, అమ్మ చెరువులకు అభివృద్ధి పనులు చేపట్టడంపై మసీదుపాడు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.