ఆంధ్రప్రదేశ్, ఏలూరు, మే 14: ప్రజలు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం ద్వారా మాత్రమే స్వీయ ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని బడేటి చంటి అన్నారు. ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలను అందించేందుకు ప్రతి గురువారం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. శిబిరానికి వచ్చిన వారిని వైద్యులు పరీక్షించి సాధారణ వ్యాధులకు చికిత్స అందించారు. అవసరమైన వారికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 40 రకాల రక్తపరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారిని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులకు రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిష్ణాతులైన వైద్యులను సంప్రదించాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలను తీర్చాలనే దృక్పథంతో పనిచేయాలని సూచిస్తున్నారని, అదే స్ఫూర్తితో ఈ వైద్య శిబిరాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిష్ణాతులైన వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి మెరుగైన ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గురువారం నిర్వహించే ఈ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, బెల్లపుకొండ కిషోర్, అమరావతి అశోక్, లంకపల్లి మాణిక్యాలరావు, పిల్లారిశెట్టి సంధ్య, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు.

