ANDRAPRADESH, MAY 25: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో 2027 గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల వంటి మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటి వరకు సరైన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదన్నారు. “అధికారులు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వాస్తవ పరిస్థితులు తెలియజేయాలి. కాగితాలపై ప్రణాళికలు చూపించడం కాదు, నేలమీద పనులు కనిపించాలి” అని స్పష్టం చేశారు.
పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. రూ.8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. “ఒకే ఏడాదిలో 7 వేల పనులు ఎలా పూర్తి చేస్తారు? సరైన ప్రణాళిక లేకుండా పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బతింటుంది” అని వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదని పేర్కొన్న పవన్.. కేంద్ర నిధులు పొందాలంటే పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. “ప్రణాళిక లేకుండా అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ నిధులు ఇవ్వరు. ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన డేటా, డీపీఆర్, ఖర్చుల అంచనాలు సిద్ధంగా ఉండాలి” అని అన్నారు. అలాగే, హడావుడిగా నాసిరకం పనులు చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “పాచిపోయిన సిమెంట్‌తో పనులు చేసి తర్వాత ప్రమాదాలు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది” అని స్పష్టం చేశారు.
ఇక, గత పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. పుష్కరాల ఏర్పాట్లు కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు విస్తరించాలని సూచించారు. భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో స్నానం చేసేలా చర్యలు తీసుకోవాలని, గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సన్నద్ధత అంశాన్ని త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు 2027 గోదావరి పుష్కరాలకు అవసరమైన నిధుల సమీకరణలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాకిరణంలా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.

