ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 27: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఉప-రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, విశిష్ఠ అతిథిగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ ప్రసంగిస్తూ.. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అనేక మంది విభిన్న రంగాల్లో రాణించారని అన్నారు. తాను సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చానని, రెండు గదుల ఇంట్లోనే సర్దుకున్నామని సచిన్ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి చదువంటే చాలా ఇష్టమని, ఆయన కూడా ప్రొఫెసర్ అని అన్నారు.
‘‘నేను సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చాను.. మా నాన్న కూడా ప్రొఫెసర్... ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం.. మేమంతా రెండు గదుల ఇంటిలోనే సర్దుకునేవాళ్లం.. నేను క్రికెట్‌లో నిలదొక్కుకున్నాకే కారు కొనుక్కున్నాను.. అందులో భారీ శబ్దంతో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసేవాడ్ని.. కానీ, ఆ సమయంలో మా నాన్న పుస్తకం చదుకుంటూ ఉండేవారు.. ఎప్పుడూ సౌండ్ తగ్గించమని అనేవారు కాదు.. పని పట్ల ఆయనకున్న ఏకాగ్రతకు నిదర్శనం.. పనిలో ఏకగ్రత ముఖ్యం.. దానిలో నిమగ్నమైతే క్రమంగా ఒత్తిడిని అధిగమించవచ్చు.. బాహ్య, అంతర్గత ఒత్తిడి ఉంటుంది.. నెట్స్‌లో కఠోర సాధన చేయడం వల్లే క్రికెట్‌లో రాణించి, ఉన్నత స్థానానికి చేరుకున్నాను.. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనసులో అనేక భయాలు, అనుమానాలు వస్తాయి.. ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే ముఖ్యం.. బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడనేది ఊహించలేం.. అలాంటి ఒత్తిడిని యువత అధిగమించి ముందుకు సాగడమే కీలకం’’ అని టెండూల్కర్ స్పూర్తిదాయక ప్రసంగం చేశారు.
ఈ వేడుకల్లో ఏపీ, ఒడిశా గవర్నర్లు అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. సుమారు 25 వేల మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన ఏయూ పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరిస్తారు.

