Ticker

6/recent/ticker-posts

ఇంధన పొదుపు పాటించాలి: మంత్రి నాదెండ్ల మనోహర్


ఏలూరు, మే 15: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరం లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


దేశ ఇంధన అవసరాల్లో 90 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతున్నామని మంత్రి తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో గత మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు బాధ్యతాయుతంగా ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు.

ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు అదనపు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. యుద్ధ పరిస్థితుల కారణంగా పెరిగిన ఇంధన ధరలను ఇప్పటివరకు ఆయిల్ కంపెనీలు భరించాయని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3 పెంపు చేయాల్సి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మంత్రివర్గంతో విస్తృతంగా చర్చించారని చెప్పారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించిన 50 శాతం బకాయిలు చెల్లించామని, మిగిలిన బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.