ఏలూరు, మే 30: జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని వచ్చే 48 గంటల్లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జనగణన పురోగతిపై శనివారం సాయంత్రం తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాల్సిన ప్రధాన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండలంలో జనగణన పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ప్రస్తుతం సేకరిస్తున్న జనాభా వివరాలను 2011 జనగణన గణాంకాలతో పోల్చి పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. జనాభాలో అసాధారణంగా పెరుగుదల లేదా తగ్గుదల కనిపించే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో గణన చేపట్టాలని సూచించారు. నమోదైన వివరాలు ఖచ్చితంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలని అధికారులకు సూచించారు.
శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను సరైన విధంగా నమోదు చేయడంతో పాటు, మరణించిన వ్యక్తుల పేర్లను సంబంధిత ధ్రువపత్రాల ఆధారంగా మాత్రమే తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర మరియు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జనగణన నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు రెండు ప్రాంతాల్లో నమోదు కాకుండా చూడడంతో పాటు, ప్రతి కుటుంబం వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.
జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాల అమలుకు కీలకమైన ఆధారంగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, గడువులోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీవోలు ప్రసన్న లక్ష్మి, రమణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

