Ticker

6/recent/ticker-posts

పిల్లలకు నైతిక విలువలు అవసరం: ఎంఏ షరీఫ్


ఉయ్యూరు, మే 10: నేటి ఆధునిక సమాజంలో పిల్లలకు ప్రాపంచిక విద్యతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక విద్య కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. ఉయ్యూరులో ఆల్ హీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నేర్చుకున్న నైతిక, ఆధ్యాత్మిక అంశాలను ప్రదర్శించగా, అతిథులు వారిని అభినందించారు.


ఈ సందర్భంగా ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ఇస్లాం మతంలో నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచితనం, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలను నేర్పిస్తే వారు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యతో పాటు సంస్కారం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ఆల్ హీరా ఫౌండేషన్ నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కేవలం చదువే కాకుండా ఆధ్యాత్మికత, నీతి, నిజాయితీ వంటి విలువలను కూడా నేర్పించాలని సూచించారు. అలా చేస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉలేమాలు, మసీదుల ఇమాములు, పట్టణ ప్రముఖులు, ముస్లిం సోదర సోదరీమణులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.