Ticker

6/recent/ticker-posts

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సీడ్ పెలెటైజేషన్‌పై అవగాహన


ఏలూరు/పెదవేగి, మే 30: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి, పంటల మొలక శాతాన్ని పెంచేందుకు సీడ్ పెలెటైజేషన్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఏలూరు డివిజన్ పరిధిలోని పెదవేగి మండలం మొండూరు గ్రామంలో అమలు చేస్తున్న PMDS (ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్) కార్యక్రమాన్ని శనివారం అధికారులు పరిశీలించారు.


జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు డివిజనల్ ఇన్‌చార్జి ఎన్ఎఫ్ఏ నవీన ఆధ్వర్యంలో అధికారులు రైతుల పొలాలను సందర్శించారు. సీడ్ పెలెటైజేషన్ చేసి చల్లిన విత్తనాల పరిస్థితిని పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి పంటల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల చేతనే సీడ్ పెలెటైజేషన్ ప్రక్రియను ప్రదర్శింపజేసి, దాని ప్రయోజనాలను వివరించారు.

పెసర, మినుము, బొబ్బర, శనగలు, జొన్న తదితర విత్తనాలను గోమయం, మట్టి మిశ్రమంతో గుళికల రూపంలో తయారు చేసి పొలాల్లో చల్లడం ద్వారా మొలక శాతం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ విధానం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

సీడ్ పెలెటైజేషన్ చేసిన విత్తనాలు ఎక్కువకాలం భద్రంగా ఉండటమే కాకుండా, మొలక వచ్చిన తరువాత మొక్కలు గాలిలోని తేమను సద్వినియోగం చేసుకుని ఎండలను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఇది కీలకమైన సాంకేతిక పద్ధతిగా మారుతోందని తెలిపారు.

భూమి ఏడాది పొడవునా ఖాళీగా ఉండకుండా ప్రధాన పంటలతో పాటు మిశ్రమ పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. విత్తనాలను ముందుగానే సీడ్ పెలెటైజేషన్ చేసి చల్లడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రాబోయే సెప్టెంబర్ వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్న ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఫీల్డ్ లెవల్ కేడర్ సభ్యులు, గ్రామ రైతులు, మహిళా రైతులు, స్థానిక ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు.