Ticker

6/recent/ticker-posts

శ్రీ వారి ఆశీస్సులతో అంతా శుభం కలగాలి -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు


ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, పల్లగిరి కొండ: శ్రీ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అంతా శుభం జరగాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. నందిగామ, పల్లగిరి కొండపై వేంచేసియున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో శ్రీ భూవరాహ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ సహిత శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు, వారి సతీమణి శ్రీమతి శిరీష ఆదివారం పాల్గొన్నారు. 


స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీపరాభవ నామ సంవత్సర చైత్ర మాస బహుళ సప్తమి నుండి ద్వాదశి వరకు అనగా ఈ నెల 9న గురువారం ప్రారంభమైన మహోత్సవ కార్యక్రమాలు 14న మంగళవారం వరకు నిర్వహించనున్నారు. ఆదివారం నాడు మహోత్సవాలు ప్రారంభమైన నాల్గవ రోజున ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ, నిత్య హోమం, బలిహరణ పూజలు నిర్వహించారు.

ఈ ఉత్సవ మహోత్సవం సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, వారి సతీమణి శ్రీమతి శిరీష ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ప్రజలంతా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆకాంక్షించారు.