ANDRAPRADESH, AMARAVATHI, JUL, 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్, బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్) కోర్సులకు తాత్కాలిక ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో ప్రకారం.. ఈ విద్యా సంవత్సరానికి కనీస వార్షిక ఫీజును రూ.47 వేలుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను నిర్ణయించే వరకు ఈ ఇంటరిమ్ ఫీజులు అమల్లో ఉంటాయి. EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే గతంలో నిర్ణయించిన ఫీజులు రూ.47 వేల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అదే ఫీజులను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ తుది ఫీజులను ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ఫీజులు అమలులోకి వస్తాయని పేర్కొంది. తుది ఫీజులు నిర్ణయించిన తర్వాత ఇంటరిమ్ ఫీజు కంటే తక్కువగా ఉంటే విద్యార్థులకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కళాశాలలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది లేదా భవిష్యత్ ఫీజుల్లో సర్దుబాటు చేయాలి. ఒకవేళ తుది ఫీజు ఎక్కువగా నిర్ణయిస్తే.. ఆ ఫీజును ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కళాశాల కూడా తుది ఫీజు నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అనుబంధ విశ్వవిద్యాలయానికి అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కళాశాలలు నోటిఫై చేసిన ఫీజు తప్ప మరే పేరుతోనూ అదనపు మొత్తాలు వసూలు చేయకూడదు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లేని కళాశాలలు ఎలాంటి ఫీజులు వసూలు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభించిన కోర్సులకు అదే కళాశాలలో అమలులో ఉన్న ఇతర కోర్సుల ఫీజులను తాత్కాలికంగా వర్తింపజేయాలని, అనంతరం కమిటీ నిర్ణయించే కోర్సు వారీ ఫీజులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. విద్యార్థులు అడ్మిషన్ సమయంలో వసూలు చేస్తున్న ఫీజు తాత్కాలికమని, APHEFRMC తుది నిర్ణయం తర్వాత మార్పులకు లోబడి ఉంటుందని కళాశాలలు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

