దెందులూరు: ధాన్యం క్వింటాల్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరు మండలం పోతునూరులో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర రూ.2369 లు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.900 బోనస్ ఇస్తోందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాలని కోరారు. ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు, నాణ్యమైన గోనె సంచులు,తూకాలు, తేమశాతం లెక్కింపులో మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రబీలో పి.ఆర్ 126 రకం వరికి బదులు ఇతర రకాలు సాగు చేయమని చెప్పడంతో పది బస్తాలు పైగా తేడా దిగుబడి వస్తున్నదని, దీనివలన రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అధిక దిగుబడులు వచ్చే విత్తనాలు రైతులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

